సుప్రసిద్ధ కథా,నవలా రచయిత్రి, కవయిత్రి,కాలమిస్ట్ శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి .

గౌరీలక్ష్మి గారు ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) లో పబ్లిక్ రిలేషన్స్ జనరల్ మేనేజర్ గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగినిగా విధుల్ని నిర్వహిస్తూనే ప్రముఖ రచయిత్రిగా తనను తాను నిరూపించుకున్నారు. 1992 లో మొదలు పెట్టి గౌరీలక్ష్మి గారు గత 26 సంవత్సరాలుగా నిరంతరాయంగా సాహితీ సేద్యం చేస్తూ,నవలా రచయిత్రిగా, కథా రచయిత్రిగా, కవయిత్రిగా వీరు చక్కని పేరు తెచ్చుకున్నారు. ఈమె రాసిన అనేక కధలకు,కవితలకు బహుమతులు అందుకున్నారు. ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీ విళంబి ఉగాది ( 18.3.18) నాడు గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు.

గోదావరి నదీపాయల మధ్య కోనసీమలో పుట్టి కొబ్బరి,మావిడి తోటల మధ్య నేస్తాలతో కోతి కొమ్మచ్చి ఆడుతూ కాలవలో ఈతలు కొట్టిన గౌరి గారికి, ప్రకృతి అంటే గొప్ప ఆరాధన. అంతర్వేది సముద్రానికి ఆనుకుని ఉన్న అంతర్వేది పాలెం గ్రామంలో ఈమె జన్మించారు. తల్లి తండ్రులు కీ.శే. అల్లూరి లక్ష్మీపతి రాజు, కీ.శే. శ్రీమతి ఎ. నరసమ్మ గార్లు. ఆరేళ్ళ వయసులోనే మాతృమూర్తి గారిని పోగొట్టుకున్న వీరు, ఆ లోటు తెలీకుండా తమ ఇంట పెంచి పెద్దచేసిన తన ముగ్గురు అక్కయ్యలు శ్రీమతులు వెంకటనరసమ్మ, సరస్వతి,సూర్యకాంతం, బావగార్లు కీ.శే. పెన్మెత్స వెంకట సత్యనారాయణ రాజు, కీ.శే. పెన్మెత్స చిన్నసత్యనారాయణ రాజు, శ్రీ దండు విశ్వనాధ రాజు గార్లకు తనెంతో రుణపడిఉంటానని అంటారు.

తనని గురించి వారి మాటల్లోనే ….…“ప్రకృతి ఆరాధనా, సంగీతాస్వాదనా వ్యసనాలుగా చేసుకుని జీవిక సాగించాలని మనసు కోరిక.కానీ లోక రీతినీ, గతినీ, మానవ నైజాలనీ గమనిస్తూ నాతో పాటు జీవన వాహినిలో సాగుతున్న తోటి మనుషులని మధ్య ఘర్షణ చూసినప్పుడు..మనం ఇంతకన్నా బాగా ప్రశాంతంగా బతకలేమా ? ఆలోచించలేమా ? అనుకుంటూ తోటి వారికి ఏదో చెప్పాలన్న తపన, ఉద్వేగం నన్ను రాయిస్తాయి. మానవ సంబంధాల కోణంలో నా రచనా గవాక్షాల నుంచి రాల్చిన చిట పట రవ్వలే నా రాతలు.” అంటూ తన సున్నిత హృదయాన్ని తొమ్మిది పుస్తకాల రూపంలో మనముందుంచారు. వీరు తన భర్త శ్రీ సుబ్రమణ్య గోపాల రాజు గారి సహృదయ సహకారంతోనే తన రచనా వ్యాసంగం కొనసాగించగలుగుతున్నానని అంటారు.

మానవ సంబంధాల కోణంలో నా రచనా గవాక్షాల నుంచి రాల్చిన చిట పట రవ్వలే నా రాతలు.” అంటూ తన సున్నిత హృదయాన్ని తొమ్మిది పుస్తకాల రూపంలో మనముందుంచారు. వీరు తన భర్త శ్రీ పెన్మెత్స సుబ్రమణ్య గోపాల రాజు గారి సహృదయ సహకారంతోనే తన రచనా వ్యాసంగం కొనసాగించగలుగుతున్నానని అంటారు.

వీరి అమ్మాయి శ్రీమతి కాంతి రేఖ, ఈమె CHENNAI లో SOFTWARE ENGINEER. అల్లుడు నడింపల్లి రఘు కిరణ్, CHENNAI లో ASSOCIATE PROFESSOR. మనవళ్లు చిరంజీవులు సాయి వివేక్ వర్మ, శ్రీ ప్రణవ్ వర్మ.

వీరి అబ్బాయి పెన్మెత్స ఫణి చంద్ర వర్మ, BANGALORE లో CONSTRUCTION MANAGER. కోడలు శ్రీమతి లక్ష్మీ శ్రావణి, BANGALORE లో SOFTWARE ENGINEER. మనవరాలు బుజ్జాయి చిరంజీవి సాయి శుభ.