Mano Chitram

Mano Chitram

--Alluri Gouri Lakshmi Rs.120

Description

“మనోచిత్రం" వీరిమొదటి కధా సంపుటి. 1993 నుండీ 96 వరకూ రాసిన 20 కధలతో మే 1997 లో దీనిని ప్రచురించడం జరిగింది.1983 లో విజయ బాపినీడు గారి విజయ మాసపత్రికలో ప్రచురించబడిన ‘మగాడు’ అనే తొలి కథ కూడా ఇందులో ఉంది.

"మానవ సంబంధాలు పూర్తిగా, వాణిజ్య పరంగా మారిపోతున్న ఈ రోజులలో మనిషి గుండెను తట్టి, నిద్రాణమైపోతున్న మానవతను మేల్కొలిపి, తోటి మనిషిని మనిషిగా ప్రేమించమని , నిష్కల్మషంగా అర్ధం చేసుకోమని ఉద్బోధించడానికి కధా సాహిత్యం దోహదపడుతుంది" అన్నసత్యాన్నినమ్మి దానిని ఆచరించడమే తన ప్రయత్నం అని ముందుమాటలో రచయిత్రి చెప్పుకున్నారు.

ప్రధానంగా మానవ సంబంధాలు కధా వస్తువులు గా ఉన్న ఈ కధలు స్వాతి,ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ,ఆంధ్ర భూమి, పల్లకీ,మయూరి వంటి వార పత్రికలలోనూ, సుప్రభాతం, తేజ వంటి పక్ష పత్రికలలోనూ విజయ,విపులవంటి మాస పత్రికలలోనూ ప్రచురించబడినవి.

ప్రముఖ రచయిత శ్రీ వేదగిరి రాంబాబు గారు ముందు మాట రాశారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లి, హైదరాబాదు లో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి ద్వారా ఈ ప్రచురణ ఆవిష్కరించ బడింది. శ్రీ మునిపల్లె రాజుగారు, డా. ఎల్లూరి శివారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డా. సి. మృణాళిని గారు పుస్తక పరిచయం చేశారు. ఈ కథా సంపుటిని వీరి తండ్రిగారైన కీ.శే. శ్రీ అల్లూరి లక్ష్మీపతి రాజుగారికి అంకితం చేశారు.

ముఖచిత్రం శ్రీ " చంద్ర " గారు వేశారు.

Features

Title :Mano Chitram
Author: Alluri Gouri Lakshmi
Pages: 165
Language: Telugu

Vasantha Kokila

Vasantha Kokila

--Alluri Gouri Lakshmi Rs.110

Description

"వసంత కోకిల " వీరి రెండవ కథా సంపుటి . 1995 నుండీ 2003 వరకూ రాసిన 26 కథలతో మార్చ్ 2003 లో దీనిని ప్రచురించారు. ప్రముఖ రచయిత, శ్రీ దుత్తా దుర్గా ప్రసాద్ గారు ఈ పుస్తకాన్ని ద్వారకా హోటల్, హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు గారు, ప్రముఖ రచయిత్రి శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు ముఖ్య అతిధులుగా, రచయిత, ఎడిటర్ శ్రీ పొనుగోటి కృష్ణారెడ్డి గారు ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. శ్రీమతి అత్తలూరి విజయ లక్ష్మిగారు పుస్తక పరిచయం చేశారు.

"ఎన్ని దెబ్బలు తిన్నా, మనుషుల్లో మంచితనం కొంతైనా ఉంటుందనీ, సహానుభూతిని వెలికి తియ్యగలననీ మొక్కవోని నమ్మకంతో ముందుకు సాగడం నా బలహీనత. ఆ ప్రయాణంలో భాగమే ఈ, నా రచనా వ్యాసంగం ” అన్నారు రచయిత్రి.

ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ కేతు విశ్వనాధ రెడ్డి గారు ముందు మాటలో “ ఈమె కధనంలో చదివించే గుణం,శైలిలో సూటిదనం, స్పష్టతా ఉన్నాయని” రాస్తూ, "ఈమె పట్టణ మధ్య తరగతి జీవన విధానాలనూ, ఘర్షణలనూ, వైరుధ్యాలనూ తన కధలలో చిత్రిస్తూ, మహిళలు భిన్న స్థలాల్లో, విభిన్న మనస్తత్వ సంస్కారాల మధ్య ఎదుర్కొంటున్న హింసా రూపాలను అవగాహన చేసుకుంటూ వాటిని నిజాయితీగా రాసింది. ఈమె మహిళల జీవితాలను ఏక పక్షంగా చూడకుండా సవర్గ దుర్మార్గాలనూ, వంచనలనూ కూడా బహిర్గతం చేసింది. స్త్రీ వాద సాహిత్య అధ్యయనంలో ఈ కధలను చర్చించవలసిన అవసరం ఉంది ” అన్నారు.

ఈ కథా సంకలనాన్ని వీరి అత్తామామలైన కీ.శే. శ్రీమతి సుబ్బాయమ్మ,శ్రీ పెన్మెత్స వెంకట సూర్యనారాయణరాజు గార్లకు అంకితం చేశారు. ఈ కధలన్నీ ఆంధ్ర భూమి,ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి, స్వాతి వార పత్రికలలోనూ, విపుల మాసపత్రిక, వార్త దినపత్రిక ఇంకా ఆకాశవాణిలోనూ వచ్చినవి.

ముఖచిత్రం శ్రీ " కరుణాకర్ " గారు వేశారు.

Features

Title :Vasantha Kokila
Author: Alluri Gouri Lakshmi
Pages: 165
Language: Telugu

Niluvutaddham

Niluvutaddham

--Alluri Gouri Lakshmi Rs.100

Description

“నిలువుటద్దం” కవితా సంపుటిని 2008లో జ్ఞానపీఠఅవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డిగారు, తెలుగు యూనివర్సిటీలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ బి.పి. ఆచార్య, IAS, శ్రీ MVS ప్రసాద్, IAS విచ్చేశారు.

"సహానుభూతికి భాష అవసరం లేదు.స్పందించే హృదయం చాలు.అయినా ఒకింత ఆవేదనతో,ఆశతో నిదురించే మెదళ్ళనూ,గట్టిపడిన గుండెల్నీ తట్టి లేపటమే కవిత్వం " అంటారు కవయిత్రి.

"ఇప్పుడు వీస్తున్న కవిత్వం గాలిని గుండెల నిండా శ్వాసించాలంటే ఆధునిక జీవన సంక్లిష్టతా నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. మారుతున్న మానవ సంబంధాల్నీ, విలువల్నీ గుర్తించాలి. కవిత్వానికీ మనిషికీ ఉన్న దగ్గరి సంబంధం అనుభవించాలి. స్నేహితురాలు గౌరి కథలల్లడంలో నేర్పరి. ఈ కవిత్వాన్ని ఇన్నాళ్ళు ఎక్కడ దాచిందో... గుండె లోపలి పొరల్లోంచి ఊటలా... చెమ్మగిల్లిన అశ్రువులా... దిగుళ్ళ గుబురుపొదల్లో ఒక్కొక్కటి చదువుతుంటే గౌరిలోని కవయిత్రి చాల స్పష్టంగా నిలువుటద్దంలో ప్రతిబింబించింది. కవయిత్రి ప్రతి కవిత నిలువుటద్దం లోంచి పలకరించే ఆకర్షణీయమైన, నిర్మలమైన ప్రతిబింబంలా ఉంది. ఇది మనిషి బింబం. ఈ నిలువుటద్దం మనం కోరుకుంటున్న అచ్చమైన మనిషిదే! గౌరికి జీవితం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, అవగాహనకు ఈ 'నిలువుటద్దం' కవితాసాక్షి!" అన్నారు డా. సి. భవానీ దేవి ముందు మాటల్లో. వారే పుస్తక పరిచయం కూడా చేశారు.

ఈ కవితా సంపుటిని కవయిత్రి తమ తల్లిగారైన కీ.శే.శ్రీమతి అల్లూరి ఎ.నరసమ్మ గారికి అంకితం యిచ్చారు.

వీటిలోని కొన్ని కవితలు ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి,మయూరి,పల్లకీ, ప్రజాశక్తి మొదలైన మ్యాగజైన్ లలో ప్రచురించబడినవి. ముఖచిత్రం శ్రీ " కరుణాకర్ " గారు వేశారు.

ప్రతి కవితకూ పక్కపేజీలో బొమ్మలు వేసినది కూడా శ్రీ "కరుణాకర్" గారే.

Features

Title : Niluvutaddham
Author: Alluri Gouri Lakshmi
Pages: 74
Language: Telugu

Bhaavavallari

Bhaavavallari

--Alluri Gouri Lakshmi Rs.90

Description

“భావవల్లరి” కాలమ్స్ సంకలనాన్ని 2008లో జ్ఞానపీఠ గ్రహీత డా.సి.నారాయణ రెడ్డిగారు, తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ బి.పి. ఆచార్య, IAS, శ్రీ MVS ప్రసాద్, IAS విచ్చేశారు.

రచయిత్రి మాట్లాడుతూ "ఇతర సాహిత్యప్రక్రియలన్నిటి కన్నా నాకు కాలమ్స్ అంటే ఎక్కువ మక్కువ. ఇవి మనసులోని భావాల్ని మనవారితో ముఖాముఖీ ముచ్చటిస్తున్నట్టుగా ఉంటాయి.హృదయానికి హత్తుకునే ప్రియసంభాషణలూ,కొన్ని కఠిన వాస్తవాల్నిచెబుతూనే మనసులను తేలిక పరచే సెటైర్ లూ,మరి కొన్నిసరదా మాటలూ, జీవిత సత్యాలూ, చిలిపి వ్యాఖ్యానాలూ కలగలిపి ఉండే కదంబమాల కాలమ్స్" అంటారు. ఈ కాలమ్స్ అన్నీ" విజేత" దిన పత్రికలో వారం వారం ” ఊహలమాలిక” అనే శీర్షికతో ఒక ఆరు నెలలు ప్రచురించబడ్డాయి.

"ఈ సంపుటిలో ఉన్న30 వ్యాసాలు చదివాను. శ్రీమతి గౌరీలక్ష్మికి జీవితం మీద గొప్ప గౌరవం ఉంది.ఈ కాలమ్స్‌లో బంధాలు, బంధుత్వాలు, అనుభూతులు, కళాసృష్టి, ఆశ నిరాశల గురించి స్నేహంగా మాట్లాడుతుంది. అబధ్ధాన్ని ఆపద్భాంధవిగా వర్ణిస్తూ ‘సొంతిల్లు ముచ్చట’ చెప్పి నవ్విస్తుంది.ఊహకీ, వాస్తవానికీ మధ్య తేడాలు, మనుషుల స్వభావాలూ చర్చిస్తూ 'బీ నెగటివ్' అంటుంది.ఈ కాలమ్స్ ఇతర్లని నొప్పింపకుండా, తానొవ్వకుండా చేసిన ఒక ఆత్మీయ సంభాషణ.ఈ అమ్మాయి సహృదయురాలు, స్నేహశీలి అనిపిస్తుందీ కాలమ్స్ చదువుతుంటే.ఈ వ్యాసాల్లో అన్నీ జీవిత సత్యాలే ఉన్నాయి. దేశ భవిష్యత్తుయువతే అంటారు. అంచేత వాళ్ళుచదవడం అవసరం. వందమంది చదివితే ఒకరు మారినా మంచిదే ” అన్నారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి బీనాదేవి గారు తమ ముందు మాటలో.

పుస్తక పరిచయం ప్రముఖ రచయిత శ్రీవిహారి గారు చేశారు. ఈ కాలమ్స్ సంపుటిని రచయిత్రి తమ అక్కాబావలైన శ్రీమతి సరస్వతి, శ్రీ దండు విశ్వనాథరాజు గార్లకు అంకితం చేశారు.

Features

Title :Bhaavavallari
Author: Alluri Gouri Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 98
Language: Telugu

Antarganam

Antarganam

--Alluri Gouri Lakshmi Rs.100

Description

“అంతర్గానం” నవలను డా. ఎన్.గోపి గారు, రవీంద్రభారతి మినీ హాల్లో, 2012లో ఆవిష్కరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ దాట్ల రమేష్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

“కష్టసుఖాలు, చీకటి వెలుగులు సహజమే అని తెలిసినా, ఎప్పటికప్పుడు మనసు స్పందించక మానదు. అది నిరంతరం నిశ్శబ్ద గానం ఆలపిస్తూనే ఉంటుంది. అందులో నవ రసాలూ ఉంటాయి. మనసు పాడే మౌనరాగాలు.....ఎన్నో....” ఇదే అంతర్గానం అన్నారు రచయిత్రి.

ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ విహారి గారు తమ ముందు మాటలో “ఈ నవలలో కొన్ని ముఖ్యపాత్రలు మధ్యతరగతి జీవులు. వీరిలో మానసిక స్థైర్యం కలవాళ్ళూ, లేనివాళ్ళూ, ఇతర వైకల్యాల బాధితులూ ఉన్నారు. వారంతా రోజూ మనం చూస్తున్న వారూ, మనతో కలసిమెలసి తిరిగేవారూ. వారంతా అతి సహజంగా వారి బలహీనతల్నీ, బలిమినీ కూడా మనతో పంచుకుంటారు. ఏతా వాతా వారంతా మనమేనా అన్నంత సన్నిహితంగా అనిపిస్తారు. కథగా చూస్తే ఈ నవలలో మూడు యువజంటలు మనల్ని పలకరిస్తారు. ఆ జంటల్లోని ముగ్గురమ్మాయిలూ మనకి మిత్రులే అనిపిస్తారు. వారి మనోభావాలతో మనమూ మమేకమవుతాం.

ఆర్ధిక స్వావలంబన కోసం ఒకమ్మాయి, పురుషాహంకారంతో బాధిస్తున్న భర్తతో ఒకమ్మాయి, జీవితంలో సరైన భాగస్వామి దొరకక ఒకమ్మాయి తమ జీవితాలను చక్కదిద్దుకునే క్రమమే ఈ అంతర్గానం.వాస్తవిక చిత్రణతో ఉన్న ఈ చక్కటి నవల అంతా ఒక స్ర్కీన్ ప్లే లా సాగి పోయింది ” అన్నారు.

డా.సి.భవానీదేవి ఆత్మీయ అతిధిగా హాజరయ్యారు. డా. ముక్తేవి భారతి గారు, శ్రీ సుథామ గారు నవలా పరిచయం చేశారు. ఈ నవలను రచయిత్రి తమ అన్నా వదినలు శ్రీ అల్లూరి సూర్యనారాయణ రాజు, శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గార్లకు అంకితం చేశారు.

ఈ నవల ఎడిటర్ శ్రీ విజయబాబుగారి ఆధ్వర్యంలో, ఆంధ్రప్రభ దినపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయింది. ముఖ చిత్రం శ్రీ రాంపా గారు వేశారు.

Features

Title :Antarganam
Author: Alluri Gouri Lakshmi
Pages: 165
Language: Telugu

Kottha Choopu

Kottha Choopu

--Alluri Gouri Lakshmi Rs.90

Description

“కొత్త చూపు” కథా సంపుటిని శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, IAS, రవీంద్రభారతి మినీ హాల్ లో 2014 లో ఆవిష్కరించారు. ఆత్మీయ అతిథులుగా డా. సి. భవానీదేవి, శ్రీమతులు ఐనంపూడి శ్రీలక్ష్మి, అత్తలూరి విజయలక్ష్మి పాల్గొన్నారు. శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు కథల పరిచయం చేశారు.

“మనుషులు వాళ్ళే- సమస్యలు అవే – ఘర్షణ పాతదే... చూపుమాత్రం కొత్తది “అంటారు రచయిత్రి.

ప్రముఖ కథా రచయిత కీ.శే. శ్రీ పోరంకి దక్షిణామూర్తిగారు తమ ముందుమాటలో “ఈ సంపుటంలోని కథానికలలో దాదాపు అన్నీ వ్యక్తుల ప్రవృత్తి మూలకంగా ఉత్పన్నమయి క్రమంగా కుటుంబానికీ ,సమూహానికీ, సమాజానికీ సంక్రమించిన సమస్యా బీజాలని చెప్పవచ్చు. వీటిని ఎక్కడికక్కడ, ఏ స్థాయిలో ఉన్నవాటిని ఆ స్థాయిలో విశ్లేషించుకోవచ్చు. పరిష్కరించుకోవచ్చు. కాని అంత స్తిమితత్వం ఎవరికీ లేదు. అందువల్ల సమస్యాపాశాన్ని తెగేదాకా లాగుతారు. ఇది వివేకవంతుల లక్షణం కాదని అందరికీ తెలుసు. కాని వాస్తవంలో జరుగుతున్నది.

ఈ సంపుటంలో ఉన్న ఓ కథలో ఒక విశేషముంది. ఇది ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రభావాన్ని వస్తువుగా తీసుకొని రచించినది. స్వార్థ ప్రయోజనపర రాజకీయ ద్వేషాగ్ని శిఖలు పెల్లుబికి ఏళ్ల తరబడిగా లావాను వెలిగక్కుతూ కాలికింది భూమి బద్దలు కావడాన్ని మన తరంలో చూడవలసి రావడం చాలా పెద్ద విషాదం! బహుముఖ ప్రజ్ఞావంతురాలు, బహు ప్రక్రియా నిర్వాహ కౌశల సంపన్నురాలు అయిన గౌరీ లక్ష్మిగారి కథానికలు లోతుగా ఆలోచింపజేస్తాయి; అవగాహన పరిధిని పెంచుతాయి; అనుభూతిని గాఢతరం చేస్తాయి. ఆమె కథానికలు అందరికీ కావలసినవి; కనుక ఆమె అందరికీ 'కావలసినవారు.' వారిని మనసారా అభినందిస్తున్నాను; ఉజ్జ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

ఈ సంపుటిని రచయిత్రి తన అక్కయ్యలైన శ్రీమతి పెన్మెత్స వెంకటనరసమ్మ, శ్రీమతి దండు సరస్వతి, శ్రీమతి పెన్మెత్ససూర్యకాంతం గార్లకు అంకితమిచ్చారు. ఇందులోని కధలు ఆకాశవాణిలో ప్రసారంతో పాటు సాక్షి,రచన, ఆంధ్రప్రభ, ఆంధ్ర భూమి,నవ్య,జాగృతి,నది,రంజని,చినుకు, విపుల మొదలైన మ్యాగజైన్ లలో ప్రచురింపబడ్డాయి. ‘సభాపర్వం’ అనే కథ రచనలోనూ ,’గమ్యందిశగా’ అనే కథ ఆంధ్ర భూమిలోనూ, ‘స్నేహ సౌరభం’ అనే కథ ఆంధ్రప్రభలోనూ, ‘లోపలి స్వరం’ అనే కథ జాగృతి వారపత్రికలోనూ బహుమతులు పొందాయి. ముఖచిత్రం తనయుడు శ్రీ పెన్మెత్స ఫణిచంద్ర వర్మ వేశారు.

Features

Title : Kottha Choopu
Author : Alluri Gouri Lakshmi
Publisher : Navodaya Book House
ISBN : NAVOPH0592
Binding : Paperback
Published Date : 2014
Number Of Pages : 128
Language : Telugu

Neerenda Deepalu

Neerenda Deepalu

--Alluri Gouri Lakshmi Rs.60

Description

“నీరెండ దీపాలు“ కవితా సంకలనాన్ని,2016 డిసెంబర్ లో హైదరాబాద్ బుక్ ఫెయిర్, ఎన్ఠీఆర్ స్టేడియం, తెలంగాణ లో శ్రీ పత్తిపాక మోహన్ అధ్యక్షతన జరిగిన సభలో డా.సి.భవానీదేవి ఆవిష్కరించారు.కవయిత్రి స్వాతి శ్రీపాద పుస్తక పరిచయం చేశారు. ఆత్మీయ అతిధులుగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ , బిక్కి కృష్ణ, కాంతికృష్ణ పాల్గొన్నారు. ఇదే కవితా సంకలనాన్ని,2017 జనవరి లో విజయవాడ బుక్ ఫెయిర్, ఆంధ్ర ప్రదేశ్ లో సర్వశ్రీ చినుకు రాజగోపాల్, సశ్రీ , కస్తూరి మురళీ కృష్ణ వంటి ఆత్మీయ మిత్రుల నడుమ ఆవిష్కరించడం జరిగింది.పుస్తక పరిచయం కవయిత్రి మందరపు హైమవతి చేశారు.ఈ సంకలనం లోని కవితలన్నీ ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి,చినుకు,నవ్య, సూర్య,భూమిక, కౌముది,సాక్షి,వెలుగు పత్రికలలో ప్రచురించబడినవి.

“జీవితాన్ని సూటిగా అల్పాక్షరాలలో ఆవిష్కరించి, గురువులా గమ్యాన్ని చూపి, ఆత్మీయ ఆలింగనమిచ్చే కవిత్వం అంటే నాకు ఆరాధన " అంటూ తనకు కవిత్వం పట్ల గల మక్కువనూ, గౌరవాన్నీ ‘నామాట’లో వ్యక్తపరిచారు కవయిత్రి.

ఈ పుస్తక ప్రచురణ చేసిన సాహితీ సంస్థ వారు ముందుమాట రాస్తూ "ఈ కవితలన్నీ, రచయిత్రి హృదయ స్పందనలు.వీటిలో సమకాలీన సామాజిక,రాజకీయ పరిస్థితులు,మానవ మనస్తత్వాలు,పరిస్థితులపట్ల ఆవేదన, ఆక్రోశం,విసుర్లూ,విమర్శలూ,స్నిగ్దమైన స్పందనలు ,కోమల భావాలు కూడా ఉన్నాయి.ఒక్క మాటలో చెప్పాలంటే భావ దారిద్ర్యపు విద్వేషాల పలకరింతల నడుమ ఒక శీతల పవనం,ఒక చల్లని చిరుజల్లు లాంటిది గౌరీలక్ష్మి కవిత్వం. కవితా దాహార్తుల గొంతులు తడపడం కోసం ఈ వైపు కురిసిన అచ్చమైన కవితా చినుకులు ఈ నీరెండ దీపాలు” అన్నారు. రచయిత్రి ఈ సంపుటిని తన జీవిత భాగస్వామి.

Features

Title : Neerenda Deepalu
Author : Alloori Gouri Lakshmi
Publisher : Sahithi Prachuranalu
Binding : Paperback
Published Date : 2017
Number Of Pages : 110
Language : Telugu

Anukoni Athidhi

Anukoni Athidhi

--Alluri Gouri Lakshmi Rs.60

Description

“అనుకోని అతిధి” నవలను, జనవరి,2018 లో విజయవాడ బుక్ ఫెయిర్-ఆంధ్ర ప్రదేశ్ లో, కృష్ణాజిల్లా రచయితల సంఘం వారిస్టాల్ లో సాహితీ మిత్రుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ప్రముఖ కవయిత్రి శీలా సుభద్రాదేవి,ప్రముఖ రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల,ఎమెస్కో లక్ష్మి,సర్వశ్రీ జీవీ పూర్ణచంద్,గుత్తికొండ సుబ్బారావు,ప్రముఖ కవి బిక్కి కృష్ణ ఈ ఆనందంలో పాలుపంచుకున్నారు.

“సినిమాలు చూసీ, నవలలు చదివీ ఊహాప్రపంచంలో ఆకాశ మార్గాన విహరించే పెళ్లికాని అమ్మాయిలను నేలకు దించి వాస్తవాన్ని తెలియచెప్పాలని చేసిన ప్రయత్నమే ఈ నవల” అంటారు రచయిత్రి.

ఆంధ్రభూమి ఎడిటర్ శ్రీ వేణుగోపాల్ గారి ప్రోత్సాహంతో రాసిన ఈ మినీ నవలను, జులై నెల ఆంధ్ర భూమి మాసపత్రికలో అనుబంధ నవలగా వారు ప్రచురించారు.

“ఓ అందమైన యువతికి తన కలల రాజకుమారుడు ఇలలో కనబడ్డాడు. అయితే అతను వివాహితుడు. అతన్ని సాధించుకోవడం కోసం ఆ అమ్మాయి చేసిన ప్రయత్నంలో ఆ ముగ్గురి జీవితాలలో చెలరేగిన పరిణామాలే ఈ నవల ఇతివృత్తం.”

రచయిత్రి ఈ నవలను తన ప్రియాతిప్రియ మిత్ర బృందానికి అంకితం ఇచ్చారు. ముఖచిత్రం ఆంధ్ర భూమి ఆర్టిస్ట్ శ్రీ విజయ్ గారు వేశారు.

Features

Title : Anukoni Athidhi
Author : Alluri Gouri Lakshmi
Publisher : Sahithi Prachuranalu
ISBN : EMESCO1006
Binding : Telugu
Published Date : 2017
Number Of Pages : 134
Language : Telugu

Yedha Lopali Yedha

Yedha Lopali Yedha

--Alluri Gouri Lakshmi Rs.80

Description

“ఎద లోపలి ఎద” నవలను, జనవరి, 2019 లో విజయవాడ బుక్ ఫెయిర్-ఆంధ్ర ప్రదేశ్ లో, ఎమెస్కో వారి బుక్ స్టాల్ లో ప్రముఖ కవయిత్రి రచయిత్రి డా.సి భవానీదేవి ఆవిష్కరించారు. ప్రియ మిత్రురాలు ఎమెస్కో లక్ష్మి,ప్రసిద్ధ కవయిత్రి మందరపు హైమావతి కూడా ఈ సంతోషంలో రచయిత్రితో ఉన్నారు.

“దాంపత్యం పేరుతో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపకూడదని,పెళ్లి అనే చట్రంలో ఇరుక్కోకుండా సహజీవనం చేద్దామనుకున్న ఓ ప్రేమికుల జంట మొదలు పెట్టిన సహజీవన ప్రయాణంలో తిరిగిన మలుపులు ఈ నవల. వాదోపవాదాల బైటిమాటలకీ లోపలి గుండె సవ్వడికీ మధ్య దూరం దాటితే ఎలాఉంటుందో చెబుతుంది ఈ ఎదలోపలి ఎద” అంటారు రచయిత్రి.

ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి సత్యవతి గారు ముందుమాట రాస్తూ" జీవన సహచరి లేదా సహచరుడు ఒక మిత్రుడు ఒక స్నేహితురాలిగా ఉండే జంటలను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు.ఒక సామాజిక ఆమోదం, పెళ్లి ధ్రువీకరణ పత్రం లేకుండా సహజీవన సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే, ప్రేమతో పాటు ఆ ఇద్దరి జ్ఞాన చైతన్యాలు సమాన స్థాయిలో ఉండాలి.ఏ ఒక్కరు వెనక్కి తగ్గినా అనుకున్న ఆదర్శం నిలవడం సమస్యేఅన్న పాయింట్ మీద ఈ నవల రాశారీమె.ఇందులో వివాహ వ్యవ్యస్థపై సానుకూల ప్రతికూల చర్చలున్నాయి అవి కృతకంగా లేకుండా వాస్తవంగా ఉన్నాయి. నవల హాయిగా చదువుకోవడానికి బావుంది” అన్నారు.

ఈ ’ఎదలోపలి ఎద’ నవల, ఆంధ్రప్రభ దినపత్రికలో, 2017 లో ఎడిటర్ శ్రీ YSR శర్మ గారి ఆధ్వర్యంలో ధారావాహికంగా ప్రచురితమయింది. ముఖచిత్రం ఆంధ్ర భూమి ఆర్టిస్ట్ వేశారు.

ఈ నవలను రచయిత్రి తమ కుమార్తె చి.సౌ.కాంతిరేఖ,అల్లుడు శ్రీ రఘు కిరణ్,చిరంజీవులు సాయి వివేక్ వర్మ,సాయి ప్రణవ్ వర్మలకు అంకితం ఇచ్చారు.

Features

Title : Yedha Lopali Yedha
Author : Alluri Gouri Lakshmi
Publisher : Sahithi Publications
ISBN : EMESCO1106
Binding : Paperback
Published Date : 2019
Number Of Pages : 167
Language : Telugu

Ammako Abadham

Ammako Abadham

--Alluri Gouri Lakshmi Rs.90

Description

“అమ్మకో అబధ్ధం” కథా సంపుటిని ప్రముఖ ప్రచురణకర్త శ్రీమతి ఎమెస్కోలక్ష్మి గారు హోటల్ ఐలాపురం,విజయవాడలో 21.7.2019 న సాహితీమిత్రుల సమక్షంలో ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా డా.సి.భవానీదేవి,గౌరవఅతిధిగా డా.జి.వి.పూర్ణచంద్, విశిష్ట అతిధిగా శ్రీ సాయిపాపినేని పాల్గొన్నారు. శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు కథల పరిచయం చేశారు.

“అమ్మకు అబద్దం చెప్పినా, మనుషుల మధ్య మానవసంబంధాల వంతెన నిర్మిద్దామన్నా, కొత్తమట్టిలో స్నేహపు చలువ చెట్టు నాటినా, గో గ్రీన్ మెసేజ్ అన్నా నిజాయితీగా కర్తవ్య నిర్వహణ చేద్దామన్న సత్సంకల్పమే. మారుతున్న సమాజానికి అనుగుణంగా మనల్ని మనం ఎదిగించుకుంటూ ఆనందాశ్రమం వైపు అపురూప జ్ఞాపకాలలో నిబ్బరంగా అడుగేద్దామంటూ రాసినవి ఈ కథలు” అని ముందుమాటలో చెప్పుకున్నారు రచయిత్రి.

“అమ్మకో అబద్ధం” అనే కథ ‘జాగృతి’ వారపత్రిక వారి 2014 దీపావళి పోటీలో రూ.15,000/- ప్రథమ బహుమతిగానూ, “ఆత్మజ్యోతి” అనే మరో కథ ‘మల్లెతీగ’ మాసపత్రికలోనూ బహుమతులు పొందాయి. మొత్తం 18 కధలు ఉన్న ఈ సంకలనంలో "మా ఊరు" శీర్షికన ఆంధ్రప్రభలో ప్రచురించబడిన తన స్వగ్రామమైన కోనసీమలోని " అంతర్వేదిపాలెం" గురించిన విశేషాలు కూడా ఇందులో జతపరిచారు.

ప్రముఖ రచయిత,విజయవాడ వాస్తవ్యులు, శ్రీ సాయి పాపినేని తమ ముందుమాటలో “కథలలోని పాత్రల హృదయ సంఘర్షణలు పాఠకుని గుండెల్లో ప్రతిధ్వనించేలా కథనాన్ని నడిపించడం మంచి కథా రచయిత లక్షణం. ఈ సంకలనంలోని కథలలోపాత్రలు అనుభవించే సంఘర్షణ ఎంత జఠిలమైనదైనా దానికి సమాధానం ప్రతి కథ ముగింపులో దొరుకుతుంది. ఊయల తొట్టిలో ఉగ్గబట్టి ఏడ్చే పాపాయిని అక్కున చేర్చుకున్న అమ్మ పొదివిలా కథలన్నీహాయిగా ముగుస్తాయి. ఈమె కలం నుంచి మరిన్ని మంచి కథలు రావాలని ఆశిస్తున్నాను” అన్నారు.

ఈ సంపుటిని రచయిత్రి తన ప్రియపుత్రుడు చి.ఫణిచంద్ర వర్మ,కోడలు చి.సౌ.లక్ష్మిశ్రావణి,బంగారు బుజ్జాయి చి.సాయిశుభలకు అంకితమిచ్చారు. ఇందులోని కధలు ఆకాశవాణిలో ప్రసారంతో పాటు ఆంధ్ర ప్రభ,ఆంధ్ర జ్యోతి,ఆంధ్ర భూమి,చినుకు,తేజ,పాలపిట్ట,మల్లెతీగ,ఎంప్లాయిస్ వాయిస్ మొదలైన మ్యాగజైన్ ల లోనూ ఇంకా వెబ్ పత్రి కలైన వాకిలి,సంచిక,గో తెలుగు లోనూ ప్రచురించబడ్డాయి.

Features

Title : Ammako Abadham
Author : Alluri Gouri Lakshmi
Publisher : Sahithi Publications
ISBN : MANIMN0608
Binding : Paperback
Published Date : 2019
Number Of Pages : 151
Language : Telugu

Gouri Lakshmi Books Review ..Souvenir

Gouri Lakshmi Books Review ..Souvenir

శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి - సాహిత్య సమాలోచనం" పేరిట ఒక ఆత్మీయ సదస్సు హోటల్ ఐలాపురం,విజయవాడలో 21.7.2019 న సాహితీమిత్రుల సమక్షంలో ఆహ్లాదకరంగా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకూ జరిగింది. రచయిత్రి పది పుస్తకాల సాహిత్య పరిశీలన చెయ్యడం ఈ సదస్సు ఉద్దేశ్యం.

ఈ సదస్సు నాలుగు భాగాలుగా జరిగింది.మొదటి భాగంలో నాల్గవ కధల సంపుటి “అమ్మకో అబద్దం”

ఆవిష్కరణ జరుగగా రెండవ సదస్సు ‘కథా సమీక్ష’ లో “మనోచిత్రం” కథలను డా.వెలువోలు నాగరాజ్య లక్ష్మి,”వసంత కోకిల” కథలను శ్రీమతి ప్రసూనా బాలాంత్రపు, “కొత్తచూపు” కథలను శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సమీక్షించారు. సభాధ్యక్షులుగా డా.సి.భవానీదేవి, ఆత్మీయ అతిధిగా శ్రీ గుత్తికొండ సుబ్బారావు పాల్గొన్నారు.

మూడవ సదస్సు ‘నవలా సమీక్ష’ లో “అనుకోని అతిధి” నవలను శ్రీమతి యలమంచిలి అంజనీదేవి, “అంతర్గానం” నవలను శ్రీ బండికల్లు జమదగ్ని,”ఎదలోపలి ఎద”ను శ్రీమతి గోటేటి లలితాశేఖర్ సమీక్షించారు. సభాధ్యక్షులుగా డా. వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, ఆత్మీయ అతిధిగా శ్రీ గోళ్ళ నారాయణరావు పాల్గొన్నారు.

నాల్గవ సదస్సు ‘కవిత్వ సమీక్ష’ లో “నిలువుటద్దం” కవితలను శ్రీ బండ్ల మాధవ రావు,”నీరెండ దీపాలు” కవితలను శ్రీమతి మందరపు హైమవతి, ”భావవల్లరి” కాలమ్స్ ను డాక్టర్ కాళ్ళకూరి శైలజ సమీక్షించారు. సభాధ్యక్షులుగా డా.సి.భవానీదేవి, ఆత్మీయ అతిధిగా శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి పాల్గొన్నారు.

పై సదస్సులు జరిగినప్పటి ఫొటోలూ, రచయిత మిత్రులు చేసిన సమీక్షల తర్వాత ఆయా రచయితలకు రచయిత్రి చేసిన సన్మానాల ఫొటోలూ, వారి సమీక్షలూ, రచయిత్రి గురువుగారైన శ్రీ శ్రీ రామారావు, మలికిపురం డిగ్రీ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ గారి ఆశీస్సు, ఇంకా ఆహూతుల ఫొటోలతో సావనీర్ ప్రచురించడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయ రచయితల్లో శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ రవికుమార్ శ్రీమతులు పుట్టినాగలక్ష్మి,కాసింబి, పాటిబండ్ల రజని,సుశీల,సుందరి,యామిని ఉన్నారు. గౌరవ మిత్రులు శ్రీ త్రినాధరుద్రరాజు , శ్రీమతి వాణీ నారాయణరావు,ఏపీఐఐసీ మిత్రులు శ్రీమతులు పద్మావతి,విజయకుమారి, ప్రియ శిష్యులు నరేష్,హర్ష,వేణు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మల్లెతీగ కలిమిశ్రీ నిర్వహించారు.