డాక్టర్ శైలజ,కవయిత్రి
ప్రింట్ మీడియా,వెబ్ మేగజైన్ ఎక్కడైనా అల్లూరి గౌరీలక్ష్మి గారి రచనలు చూడగానే ముందు చదివేయాలనిపించేంత ఉత్సాహం గా ఉంటుంది.దీనికి కారణం సంభాషణ లో మాత్రమే సాధ్యమయే జీవచైతన్యం రచనల్లో తొణికిసలాడే ప్రత్యేకత.వ్యాసం,కథ,కాలమ్ కథ ఏ ప్రక్రియ ఐనా సరే చదివాక చాలా సేపు గుండెల్లో నిండే ఒక పాజిటివ్ వైబ్రేషన్.
శీలా సుభద్రాదేవి,ప్రముఖ కవయిత్రి..నవలా కధా రచయిత్రి
అల్లూరి గౌరిలక్ష్మి గత మూడు దశాబ్దాలుగా గా కథలు, కవితలే కాక పత్రికల్లో కాలం కూడా నిర్వహించారు. ఏది రాసినా విద్యావంతులు, ఉద్యోగినులు అయిన ఆధునిక మహిళల ఆలోచనలకూ దృక్పథంకు అద్దం పట్టేలా వీరి పాత్రలు ఉంటాయి.ఏ అంశం తీసుకున్నా సరళసుందరమైన శైలి తో ఉంటాయి గౌరిలక్ష్మి రచనలు.స్నేహసౌజన్యశీలి అయినందున గౌరిలక్ష్మి తనరచనల్లో కౌటుంబిక విలువలూ మానవీయసంబంధాలకూ పెద్దపీట వేస్తూ సానుకూల ప్రతిస్పందన తో ఒకింత హాస్యస్పోరకంగా ఆహ్లాదకరంగా మనసుకు హత్తుకునేలా రాయటం వీరి రచనా విధానం.అల్లూరి గౌరిలక్ష్మి గారికి మనఃపూర్వక అభినందనలతో శీలా సుభద్రాదేవి
గోళ్ల నారాయణ రావు,విజయవాడ
ఏ విషయం మీద అయినా, ఏ సాహిత్య ప్రక్రియలో అయినా, అద్భుతమైన అవగాహనతో, అబ్బురపరిచే అక్షరవిన్యాసం చేస్తున్న శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి కలంకారీ మరింత విస్తారమైన వేదికపై అడుగు పెడుతున్న సందర్భంలో, మరెంతో మంది అభిమానులను ప్రోగుచేసే, మరిన్ని రచనల కోసం ఎదురుచూస్తున్నాను.
విశాలాక్షి మాసపత్రిక వారి ప్రతిభా పురస్కారం 19.5.2019..నెల్లూరు
గుత్తికొండ సుబ్బారావు.మచిలీపట్నం
స్నేహమయి అల్లూరి గౌరీలక్ష్మి ఒక పెద్ద ప్రభుత్వ సంస్థలో పెద్ద ఆఫీసర్ గా పదవీవిరమణ చేశారు… ఉద్యోగంలో వున్నప్పుడూ, రిటైర్ అయినాకా కలుస్తూనేవున్నాం. హితుల యెడ ఆమె కనబరిచే ఆప్యాయత, శ్రద్ధ ల్లో ఏమాత్రం మార్పు లేదు. ఆమె రచనల విషయానికొస్తే ఎక్కువగా సామాజిక స్పృహ, ఒకింత వ్యంగ్యం కన్పిస్తాయి. అనవసరమైన కల్పితాలకు, వర్ణనలకు పోరు. సూటిగా, ధాటిగా సాగుతాయి కథనమైనా, కవితయినా. -గుత్తికొండ సుబ్బారావు.
అడుసుమిల్లి మల్లికార్జున..బాపట్ల
నాకు శైలి,శిల్పం తెలీదు.. కవిత్వం అంతకంటే తెలీదు,అంటారు గౌరీ లక్ష్మి గారు.అందువల్లనేమో ఉత్తమ సాహిత్యం రాయగలిగారు.నవల,కథ,కవిత,గల్పిక…అన్ని ప్రక్రియలు ఆమె కలంతో అందాన్ని సంతరించుకున్నాయి.నలుగురు మిత్రులు,నాలుగు పుస్తకాలు ఉంటే చాలు జీవితానికి అనే ఈమెను ఎవరితోనూ పోల్చటానికి వీలు లేదు.ఒకవేళ పోలిక తెస్తే “బీనా దేవి”గారే అగుపిస్తారు,కాసింత తక్కువా కావచ్చు,కూసింత ఎక్కువా కావచ్చు.సమాజానికి,సాహిత్యానికి అవసరమైన కలం.. గౌరీ లక్ష్మీ గారు.













