గౌరీలక్ష్మిగారు మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా సాహితీ సేవ చేస్తున్నారు. ఈమె నవలా,కథా రచయిత్రి, కవయిత్రి,కాలమిస్ట్ కూడా! ప్రభుత్వోద్యోగిగా, ANDHRA PRADESH INDUSTRIAL INFRASTRUCTION COPORATION LIMITED అనే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో PUBLIC RELATIONS, GENERAL MANAGER గా పనిచేసి పదవీ విరమణ చేశారు “మానవ సంబంధాలు పూర్తిగా వాణిజ్యపరంగా మారిపోతున్న ఈ రోజుల్లో మనిషి గుండెను తట్టి నిద్రాణమైపోతున్న మానవతను మేల్కొల్పి తోటి మనిషిని మనిషిగా ప్రేమించమనీ.నిష్కల్మషంగా అర్థం చేసుకోమనీ ఉద్బోధించడానికి కథా సాహిత్యం దోహదపడుతుంది” అన్న సత్యాన్ని నమ్మి కథలు రాస్తున్నాను, అని చెప్పుకున్న గౌరీలక్ష్మి ప్రధానంగా కథా రచయిత్రిగా అనేక విలువైన కథలను రాశారు.
కథలు:
90వ దశకంలో దాదాపు అన్ని వారపత్రికలూ సరసమైన కథలు ప్రచురిస్తున్న సమయంలో ఆ కథలు కౌమారదశలో ఉన్న యువతపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో “డ్రబ్బింగ్” కథ ద్వారా చెప్పారు. ఈ కథను ఆంధ్రప్రభలో ఎడిటర్, వాకాటి పాండురంగారావు గారు ప్రచురించారు. ఈమె రాసిన అనేక కథలకు బహుమతులు లభించాయి “అమ్మకో అబద్ధం” అనే పేరుతో అపార్ట్మెంట్ కల్చర్ లో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? అన్న సబ్జెక్టుతో రాసిన కథకు జాగృతి వార పత్రిక వారి దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. అలాగే “గమ్యం దిశగా” కథ ఆంధ్రభూమిలోనూ,స్నేహసౌరభం అనే కథ ఆంధ్ర ప్రభలోనూ,“సభాపర్వం” కథ రచన లోనూ, “లోపలిస్వరం” కథ జాగృతిలోనూ బహుమతులు పొందాయి.”రూట్స్” అనే కథలో స్త్రీ పురుష సమానత్వం అనేది స్త్రీ సంపాదనాపరురాలు కానంతవరకూ సాధ్యం కాదని చెప్పారు. Also Read – పల్లెపడుచు (కథానిక) ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ భావోద్వేగాలు చెలరేగుతున్న సందర్భంలో ఈమె ప్రాంతీయ సరిహద్దులు మారినా మనుషులంతా ఒక్కటే ,మనుషుల మధ్య అభిమానం, స్నేహం చెక్కుచెదరవని నాలుగు కథల (దృశ్యం, పరిష్కారం, సత్యం,కొత్తమట్టి)ద్వారా తెలియచేశారు.ఈ సందర్భంలో అనేక కవితలు(“ఇద్దరొక్కటిగా” మొదలైనవి), “కలిసికట్టుగా ఎదుగుదాం” వంటి వ్యాసాలు కూడా రాసి రచయితగా తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. వీటికి ఆ రోజుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. “కొత్త చూపు”, “కొత్త చివుళ్ళు”, “ఆత్మజ్యోతి”, “స్టేటస్ సింబల్” అంటూ రాసిన అనేక కథలు ఏదో ఒక మెసేజ్ తోనే రాశారు. “సుబ్బారావూ – సర్వెంట్ మెయిడూ,ఆకాశరామన్న,కథా నీకో నమస్కారం,ఇన్ స్టెంట్ యాక్టర్స్” వంటి కొన్ని హాస్య కథలు కూడా రాశారు.
నవలలు:
ఈమె రాసిన రెండు నవలలు స్త్రీలసమస్యలకు సంబంధించినవే.”అనుకోని అతిథి” అనే నవలలో, ఆడపిల్లలు వాస్తవ పరిస్థితులను గమనించకుండా ఊహలోకపు భర్తలకై ఎదురు చూస్తూ, అందమైన మగవారి ప్రేమలో పడుతూ అటువంటి యువకులకి రెండో భార్యగా ఉండడానికి సిద్ధపడడాన్ని ఖండిస్తూ అటువంటి ఆకర్షణలో పడవద్దని చెబుతారు. అలాగే “అంతర్గానం” అనే నవలలో ఆడవాళ్లు ఆర్థికంగా భర్తలపై ఆధారపడినప్పటి పరిస్థితినీ, ఆర్థికంగా సంపాదనపరురాలు అయిన తర్వాత వారి సంపాదనపై భర్తల అజమాయిషీ, భర్త కన్నా ఎక్కువ సంపాదిస్తే భర్తల ఇగో దెబ్బతినే సమస్యలనీ చిత్రిస్తూ స్త్రీలు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పురుషులతో సమానంగా, సాధికారత సాధించే క్రమంలో వారు ఎదుర్కోవల్సిన సవాళ్లను వివరించారు. Also Read – లక్ష్మణ రేఖ (కవిత) “ఎద లోపలి ఎద” పేరుతో అపురూపమైన ఒక ఆధునిక ప్రేమకు నవలారూపం ఇచ్చారు. వివాహ బంధం లోని అనుబంధాన్నీ, లోటుపాట్లనూ చక్కగా విపులీకరించారు.ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది. నేడు కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల సంతానం నిర్లక్ష్యం వహించడం స్పష్టంగా కనబడుతోంది.అందుకు వృద్ధాశ్రమాలు పెరుగుతుండడమే పెద్ద ఉదాహరణ. “మలిసంజ కెంజాయ” అనే నవలలో కొందరు వృద్ధుల విషాద జీవనాన్ని విపులంగా చర్చించారు. సంతానం యొక్క బాధ్యతారహిత్యాన్ని ఎండగడుతూ, అదేవిధంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా కొంత వరకూ మారవలసిన అవసరం ఉందని చెబుతూ సాగింది ఈ నవల. అరవై దాటిన ప్రతివారూ చదవవలసిన నవల ఇది. కవిత్వం: ‘జీవితంలో చివరికి మిగిలేవి మనుషుల మధ్య స్నేహం,ప్రేమా మాత్రమే!’ అనుకునే సున్నిత హృదయ ఈమె. “సహానుభూతికి భాష అవసరం లేదు, స్పందించే హృదయం చాలు. అయినా ఒకింత ఆవేదనతో, ఆశతో నిదురించే మెదళ్లను, గట్టిపడిన గుండెల్ని తట్టి లేపడమే కవిత్వం” అంటూ మూడు కవితా సంపుటాలను వెలువరించారు. “ధన దాహంతో కార్పొరేట్ ఆసుపత్రి ఏసీ పొగలు కక్కుతోంది. అత్యవసరం అంటూ అనవసర పరీక్షలు చేసి, పెట్టిన పెట్టుబడికి వడ్డీ లెక్కేసుకుంటోంది” అంటూ రాసిన “భయారణ్యం” అనే కవితకు పోటీలో ప్రధమ బహుమతి లభించింది.
సామాన్య ప్రజలను ఎప్పటికప్పుడు రాజకీయపరంగా ఎడ్యుకేట్ చేయవలసిన వార్తాపత్రికలు, ఏదో ఒక పార్టీ కరపత్రాలుగా మారిన నేటి పరిస్థితిపై “మీడియా చింతన” అనే కవితలో “ఫ్రీ ప్రెస్ ను కడకంటా సమాధిచేసి, ఆ గోరీపై జెండా ఎగరేసింది కాస్ట్లీ ప్రెస్” అంటూ ఒక చురుకైన భావం వెలువరించారు. ఆడపిల్లలపై దాడులు పెరుగుతున్న సందర్భంగా “ఆధునిక అమ్మాయీ ! నీ కోసం ఎవరో రారు నీకు నీవే రక్ష !” అని వారికి కర్తవ్య బోధ ఒక కవిత ద్వారా చేశారు. “చౌరస్తాలో చెల్లాయ్ ! ఎన్ని కష్టాలెదురైనా తిరిగి కుంపటి ముందు కూర్చోకు.నీ దారి ముందుకే కానీ వెనక్కి కాదు.నీ పోరాటం నిరంతరంగా సాగాలి” అంటూ మరో కవిత ద్వారా స్త్రీ జాతికి ఉపదేశం చేశారు.
కాలమ్స్: ఇంకా ఈమె, చదువరుల మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా వివిధ రకాలైన వస్తువులతో కాస్త హాస్యంగా, మరి కాస్త సీరియస్ గా దాదాపు 100 వరకు కాలమ్స్ రాశారు.ఇవి విస్తృతంగా పాఠకుల మన్నన పొందాయి.
గౌరీలక్ష్మి ఏ ప్రకియలో రాసినా సమాజానికి ఏదో ఒక సందేశం ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఎక్కువగా రాసారు. ఈమె రచనా సంవిధానంలో సానుకూల దృక్పధం,మానవ సంబంధాలపై అమితమైన, విశ్వాసం,గౌరవం కనబడతాయి.
ఈమె మొత్తం రచనలు:
నాలుగు నవలలు: 1.అనుకోని అతిధి, 2.అంతర్గానం,3.ఎద లోపలి ఎద,4.మలిసంజ కెంజాయ
నాలుగు కథా సంపుటాలు: 1.మనోచిత్రం, 2.వసంత కోకిల,3.కొత్తచూపు,4.అమ్మకో అబద్దం కవిత్వం
మూడు సంపుటాలు: 1.నిలువుటద్దం, 2.నీరెండ దీపాలు,3. ప్రవాహోత్సవం
రెండు కాలమ్స్ సంపుటాలు 1.భావవల్లరి,2. కలర్ ఫుల్ కదంబం.
FAMILY OF ALLURI GOURI LAKHSMI
- శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి జన్మస్థలం అంతర్వేది సముద్రతీరాన గల అంతర్వేదిపాలెం గ్రామం, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్.
- తల్లితండ్రులు కీర్తిశేషులు అల్లూరి లక్ష్మీపతిరాజు,ఎ.నరసమ్మ గార్లు.
- ఈమె పాఠశాల విద్యాభ్యాసం: తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలలోనూ, ఇంకా వైజాగ్,మద్రాస్ లోనూ జరిగింది.
- కళాశాల విద్య వారి స్వస్థలం దగ్గరగా ఉన్న మలికిపురం డిగ్రీ కాలేజ్ లో జరిగింది.
- విద్యార్హతలు: ఈమె B.Sc. తర్వాత MA(POLITICAL SCIENCE),BPR(Bachelor of Public Relations Degree) కూడా చేశారు.
- ఉద్యోగం: ANDHRA PRADESH INDUSTRIAL INFRASTRUCTION COPORATION LIMITED అనే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో PUBLIC RELATIONS,GENERAL MANAGER గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
- వీరి జీవన సహచరులు శ్రీ పెన్మెత్ససుబ్రమణ్య గోపాలరాజు గారు సెక్రటేరియట్ ప్రెస్ నుంచి పదవీవిరమణ చేశారు.అమ్మాయి కాంతిరేఖ,కోడలు శ్రావణి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.అల్లుడు నడింపల్లి రఘుకిరణ్ VITS,CHENNAI లో అసోసియేట్ ప్రొఫెసర్,అబ్బాయి ఫణి చంద్రవర్మ BANGALORE INTERNATIONAL AIRPORT లో మేనేజర్. మనవలు సాయి, శ్రీ, శుభ.
- గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు.ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్. POLITICAL SATIRES కూడా రాశారు.
AWARDS & REWARDS:
- 2018 లో ఈమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి” శ్రీ విళంబి ఉగాది పురస్కారం” పొందారు
- 2018 లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి “కీర్తి పురస్కారం” పొందారు
- 2015 లో లేఖిని సంస్థ నుండి “లేఖిని పురస్కారం” అందుకున్నారు
- 2011లో హైదరాబాద్ లో జరిగిన అఖిలభారతీయ హిందీ కవిసమ్మేళనంలో తెలుగు కవయిత్రిగా సన్మానం పొందారు.
- ఇంకా ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ, రచన,మల్లెతీగ పత్రికలలో కథలకూ,ఆంధ్రప్రభ,మయూరి వారపత్రికలలో కవితలకూ బహుమతులు వచ్చాయి.
- జాగృతి వారపత్రిక వారి వాకాటి పాండురంగారావు దీపావళి స్మారక కథల పోటీలో 2013లో తృతీయ, 2014లో ప్రథమ బహుమతులు లభించాయి.
- నెల్లూరు మాసపత్రిక విశాలాక్షి వారి పురస్కారం, నవ్యాన్ద్ర రచయితల సంఘం వారి సాహితీ సేవా పురస్కారం పొందారు. 8. మల్లెతీగ సాహితీ సేవా పురస్కారం, మరి కొన్ని ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.
సమాజంలో ఉన్న రాజకీయ పరిస్థితులు మానవుల జీవితాలను తప్పక ప్రభావితం చేస్తాయి అని భావించే ఈ రచయిత్రి, ఆ గౌరవంతో, ఇష్టంతో M.A.,POLITICAL SCIENCE చేశారు.
ప్రస్తుత రాజకీయ చిత్రపటాన్ని చూస్తూ కలత చెంది, వివిధ దిన పత్రికలలో అనేక రాజకీయ,హాస్య, వ్యంగ్య వ్యాసాలు(POLITICAL SATIRES) రాశారు. ఇటువంటి పలుప్రక్రియలలో తన రచనా పటిమను నిరూపించుకున్న శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు భవిష్యత్తులో మరిన్ని విలువైన ఉత్తమ రచనలు చెయ్యాలని కోరుకుందాం.
(30.01.2024న వంశీ-లేఖిని జాతీయ సాహితీ పురస్కారాల ప్రదానం – 2024, శ్రీత్యాగరాయ గానసభ,చిక్కడపల్లి,హైదరాబాద్ సభలో శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మిగారికి ప్రముఖ రచయిత్రి “మాదిరెడ్డి సులోచన పురస్కారం” అందచేస్తున్న సందర్భంగా ఈ వ్యాసం).